అక్టోబర్ 6, 1955. సిక్స్ గేలరీ, సాన్ ఫ్రాన్సిస్కో నగరం. గేరీ స్నైడర్ , జాక్ కెరాక్, మైఖెల్ మెక్ క్లూర్ , విలియంస్ బరోస్ , అలెన్ గిన్స్బర్గ్
తదితర యువకవులు కవిత్వం చదవడానికి చేరారు. గేలరీ కిటకిటలాడుతోంది. 28 ఏండ్ల యువకవి అలెన్ మైకు ముందుకొచ్చి తన కొత్త పద్యం చదవడం ప్రారంభించాడు. గేలరీ లో సూది పడితే వినబడేంత నిశ్శబ్దం. పద్యం పేరు ‘వూళ ‘. అంటూ ప్రారంభమై, ఒక ప్రవాహంలా సాగిన ‘వూళ ‘ చదువుతున్నంత సేపూ శ్రోతల్లో తీవ్రమైన అలజడి…పెనుతుఫాను… పద్యం చదవడం అవగానే మార్మోగిన చప్పట్లు …. ‘ఎంత వుద్రేకం ? ఎంత క్రోధం ? ‘ … ఆనాడు అమెరికా సామాజిక పరిస్థితులు సౄష్టిస్తున్న విధ్వన్సానికి ఆగ్రహంతో మండిపడుతున్న అనేక మంది అలెన్ ను మనసారా అభినందించారు. ‘వూళ ‘ తో గొంతు కలిపారు. అట్లా అమెరికా సమాజంలో అంతర్లీనంగా పెల్లుబుకుతున్న అసంతృప్తికీ , పరాయీకరణకూ ‘వూళ ‘ కొత్త గొంతు నిచ్చింది. ఐసెన్ హోవర్ అమెరికా స్రృష్టిస్తున్న సామాజిక బీభత్సానికి వ్యతిరేకంగా తలెత్తుతున్న ధిక్కార సన్స్కృతికి ‘వూళ ‘ ఆది కావ్యమైంది, తిరుగబడుతున్న యువతరానికి జాతీయ గీతమయింది!
ఆ రోజుల్లో శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో సిటీలైట్స్ అనే ప్రచురణ సన్స్థ ను నడుపుతున్న లారెన్స్ ఫెర్లింగేటి అలెన్ గిన్స్బర్గ్ కి ” నీ ‘వూళ ‘ పద్యం అమెరికన్ కవిత్వంలో ఒక కొత్త శకాన్ని ప్రారంభించబోతోంది. ఇంతకీ నువ్వు దాని రాత ప్రతిని నాకు ఎప్పుడు పంపిస్తున్నావు? ” అంటూ సందేశం
పంపాడు. అప్పటికే సిటీ లైట్స్ కి ఒక ప్రత్యామ్నాయ సాహిత్యానికి, సన్స్కృతికీ ప్రతీకగా మంచిపేరుంది. ‘వూళ ‘ మొదటి కాపీ 1956 హేమంతంలో సిటీలైట్స్ పాకెట్ సిరీస్ లో నాలుగవదిగా లెటర్ ప్రెస్స్ కాపీలు వెయ్యి ప్రతులు వెలువడింది. ఆనాటి సాహిత్యాన్ని ‘ వూళ ‘ తీవ్రమైన ప్రకంపనలకు గురిచేసింది. పెద్ద దుమారాన్ని లేపింది. విశ్వ విద్యాలయాల వళ్ళు, మర్యాదస్తులు, అధికారానికి దాసోహం అన్న వాళ్ళు, మితవాదులూ చెవులూ కళ్ళూ మూసుకున్నారు. ” ఇదేమిటి, ఇది కవిత్వమేమిటి, ఇదంతా బూతు, అశ్లీలం – ఇది మన పిల్లల్ని పాడు
చేస్తుంది ” అంటూ బహిరంగంగా తిట్టి పోసారు.
‘వూళ ‘ రెండవ ముద్రణ బ్రిటన్ లో జరిగింది. 520 కాపీలే అచ్చు వేసారు. 1957, మార్చి 27 నాడు ‘వూళ ‘ కాపీలను అమెరికాలోకి తెస్తున్నపుడు కస్టంస్ అధికారి ఛెస్టర్ మెకఫీ వాటిని స్వాధీనం చేసుకున్నాడు. “శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా పిల్లలకు దూరంగా ఉంచాల్సిన అశ్లీలం ఇది. దీనికి ఇక్కడ చోటు లేదు. ” అంటూ మెకఫీ ప్రకటించాడు. మే 19 న క్రానికల్ లో లారెన్స్ ఫెర్లింగేటి ‘వూళ ‘ ను సమర్థిస్తూ, “ఈ కవితలో కవి అశ్లీలం మాట్లాడ్డం లేదు. ఆయన తన చుట్టూ సమాజం లో చూస్తున్నది ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తున్నాడు. ‘వూళ ‘ లో అశ్లీలం అనబడుతున్న చెత్త మన సమాజం లో ఉన్నది. అణు ఆయుధాల్లోనూ, వెర్రి తలలు వేస్తున్న జాతీయ దురహంకారంలోనూ, రోజు రోజుకూ విపరీతంగా యాంత్రీకరించబడుతున్న మన సమాజంలోనూ మనకు కనబడకుండా పెరిగిపోతున్న చెత్త ఇది ” అని రాసాడు. తర్వాత పోలీసులు రంగం లోకి దిగి ఫెర్లింగేటిని, ఆ పుస్తకాల షాపు మేనేజరునీ అశ్లీల సాహిత్యాన్ని ప్రచురించి అమ్ముతున్న అభియోగం కింద అరెస్టు చేసారు.
ప్రభుత్వ సెన్ సార్ షిప్ కి వ్యతిరేకంగా, ‘వూళ ‘ పద్యాన్ని సమర్థిస్తూ దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళన చెలరేగింది. ఆ వేసవి లో న్యాయస్థానంలో విచారణ జరిగింది. అనేక మంది కవులు, సంపాదకులు, విమర్శకులు, అధ్యాపకులు ‘వూళ ‘ నూ సిటీలైట్స్ నూ సమర్థిస్తూ న్యాయస్థానంలో తమ టెస్టిమోనీలు సమర్పించారు. సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయమూర్తి క్లేటన్ హార్న్ . ” ‘వూళ ‘ అశ్లీలం కాదు. దానికి తీవ్రమైన సామాజిక ప్రాముఖ్యత ఉంది. ‘వూళ ‘ మొదటి భాగం లో వొక భయంకరమైన పీడకలగా మారిన మన ప్రపంచాన్ని చెప్పాడు కవి. రెండవ భాగంలో మానవ స్వభావంలోని అత్యుత్తమ లక్షణాలని సర్వ నాశనం చేస్తున్న ఆధునిక సమాజపు విధ్వన్సాన్ని చెప్పాడు. వస్తువాదమూ , మార్పుని వ్యతిరేకించి అధికారానికి గులాంగిరీ చేసే తత్వమూ, యుద్ధానికి దారి తీస్తున్న విపరీతమైన యాంత్రీకరణ – ఇవే ఆ విధ్వన్సాన్ని సౄష్టిస్తున్నాయంటాడు కవి. మూడవ భాగంలో తాను సాధారణీకరించదలుచుకున్న, కోరుకుంటున్న పరిస్థితిని ఒక నిర్దిష్త వ్యక్థి ద్వారా మన ముందుంచుతాడు. ‘వూళ ‘ కి రాసిన పాదసూచికలో ఈ సమాజం ‘పవిత్రంగా ‘ యెంచుతున్న వాటినన్నిటినీ తీవ్ర పదజాలంతో అధిక్షేపించి ఆగ్రహిస్తాడు. చివరకు పవిత్రంగా బతకమని కోరుతూ ముగిస్తాడు కవి ” అంటూ తన సంచలనాత్మక తీర్పు ప్రకటించాడు. సాహిత్యాన్ని యెట్లా చూడాలో, యేది అశ్లీలం కాదో యెట్లా నిర్ధారించాలో, సాహిత్య సామాజిక ప్రాముఖ్యాన్ని యెట్లా గుర్తించాలో తన చరితాత్మక తీర్పులో చాలా స్పష్టంగా ప్రకటించాడు న్యాయమూర్తి హార్న్. ఆయన తీర్పుకు దేశం నలుమూలలనుండీ గొప్ప ప్రశన్స వచ్చింది. ఆయన తీర్పు, వాక్స్వాతంత్రానికీ, స్వేచ్ఛగా రచనలు చేసి అభిప్రాయాల్ని ప్రకటించే హక్కుకూ, పౌర హక్కులకూ వొక బాసటగా, మైలురాయిగా నిలబడింది. ఆ తీర్పు వచ్చేక ఫెర్లింగేటి “ఇప్పుడూ నిజంగా అశ్లీలమైన పని చేసింది పోలీసులే నని ప్రపంచానికి తెల్సిపోయింది” అంటూ వ్యాఖ్యానించాడు.
‘వూళ ‘ కు ఇప్పుడు యాభై యేండ్లు నిండినయి. యిప్పటిదాకా దాదాపు పది లక్షల కాపీలు అచ్చయినయి. అనేక భాషల్లోకి అనువాదమైంది. అమెరికాలో ఒక ప్రత్యామ్నాయ సన్స్కౄతికీ, సాహిత్యానికీ, నిరసన గళాలకూ ‘వూళ ‘ ఒక ప్రతీకగా నిల్చింది. తర్వాత బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన బీట్ ఉద్యమానికి ‘వూళ ‘ ప్రారంభ గీతంగా నిలిచింది. జాక్ కెరాక్, అలెన్ గిన్స్బర్గ్, విలియంస్ బరోస్ , గేరి స్నైడర్ , గ్రెగరీ కార్సో తదితరులు తర్వాత ‘ బీట్ జనరేషన్ ‘ కవులుగా ప్రసిద్ధికెక్కారు.
రెండవ ప్రపంచ యుధ్ధానంతర కాలంలో అమెరికాలో చాలా మంది కవులు, రచయితలు, కళాకారులు , బుద్ధి జీవులు తీవ్రమైన నిరాశా నిస్పౄహలకి గురయ్యారు. స్వేచ్చా సమానత్వపు పునాదులపైన ఏర్పడ్డ అమెరికా, యిప్పుడా పునాదులే కదిలిపోయి తమకు తెలియని, తమని పరాయీకరణ చేసే, మానవ విలువలని విధ్వన్సం చేసే ఒక కొత్త ఆధిపత్య వ్యవస్థ ఏర్పడడం చూసి తీవ్రమైన అశాంతి కి గురయ్యారు. న్యూయార్కు నగరం లోని గ్రీన్ విచ్ విలేజిలో, అట్లా అశాంతికి గురయిన కవులూ, రచయితల సమూహం ఒకటి తరచూ కలుస్తుండేది. సాహిత్య చర్చలూ, రాజకీయ చర్చలూ, కవిత్వ పఠనాలూ వీళ్ళ దినచర్యలో భాగం. జాక్ కెరాక్, అలెన్ గిన్స్బర్గ్ , విలియంస్ బరోస్ వీళ్ళలో ప్రముఖులు. తమ పరిస్థితిని వర్ణిస్తూ వొక రోజు కెరాక్, ” మనమంతా వోడిపోయిన వాళ్ళం – బీట్ జనరేషన్ ” అన్నాడు. అయితే ఆ తర్వాత వాళ్ళు బీట్ కు అప్ బీట్ అనీ, సంగీతానికి బీట్ అనీ పాసిటివ్ అర్థాలు చెప్పుకున్నారు. న్యూ యార్క్ నుండి శాన్ ఫ్రాన్సిస్కో దాకా తరలి వెళ్ళి అక్కడ యితర ప్రత్యామ్నాయ సాహిత్యం పట్ల ఆసక్తి గల యితర రచయిత లతో కూడి రచనలు చేసారు. అట్లాంటి క్రమంలో అలెన్ గిన్స్బర్గ్ తన ‘వూళ ‘ రాసాడు. అది వాళ్ళ సాహిత్య యాత్రలో ఒక పెద్ద
మలుపు. అమెరికా సాహిత్య చరిత్రలో ఒక పెద్ద తుఫాను. అధికారాన్ని ధిక్కరించి మాట్లాడ్డం., దేని గురించైనా యిన్ హిబిషన్ స్ లేకుండా ప్రకటించడం, తమ సెక్సువల్ ప్రిఫరెన్సెస్ ని బహిర్గతంగా నిర్భయంగా మాట్లాడ్డం , సామాజిక పరిస్థితులనూ వాటికి కారణమైన వాళ్ళనూ తీవ్రమైన పదజాలంతో దూషించడం ,అణ్‌వాయుధాలతో చెలరేగిపోతున్న అమెరికా యుధ్ధోన్మాదాన్ని నిరసించడం , ప్రపంచాధిపత్యం కోసం యితర దేశాల మీద దాడి చేసి వేలాదిగా అమాయకుల ప్రాణాలు బలిగొంటున్న అమెరికా సామ్రాజ్యవాదాన్ని అధిక్షేపించడం , మొత్తంగానే సమాజంలో పెరిగిపోతున్న పరాయీకరణనూ, యాంత్రీకరణనూ తీవ్రమైన స్వరంతో పలకడం – తన కవిత్వంలో చేసాడు గిన్స్బర్గ్.
’వూళ ‘ అతి మర్యాదస్తుల అమెరికా సమాజాన్ని నిలబెట్టి, చాచి లెంపకాయ కొట్టి, “నీది అవధుల్లేని దురహంకారం – నీది హద్దుల్లేని యుధ్ధోన్మాదం “అంటూ గొప్ప ఆగ్రహాన్ని ప్రకటించిన పద్యం. అందుకే ‘వూళ ‘ ను చదివిన అమెరికన్ రాజ్యం వులిక్కిపడ్డది. అశ్లీలత అని కొట్టి పారేసింది. అలెన్ గిన్స్బర్గ్ ని వెలివెయ్య జూసింది.
పౌరహక్కుల కోసం , యుధ్ధానికి వ్యతిరేకంగా అట్టడుగు వర్గాలకూ, అధోజగత్తుకూ చెందిన ప్రజల కోసం నిలబడి గొంతు విప్పిన అలెన్ , జీవితాంతం ప్రభుత్వ ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు. వుద్యమాల్లో చురుకుగా పాల్గొన్నాడు. డ్రగ్సు గురించీ, హోమో సెక్సువాలిటీ గురించి , అమెరికా సామ్రాజ్యవాదం గురించీ తన అభిప్రాయాల్ని నిర్భయంగా ప్రకటించాడు. ఫలితంగా అకడెమీషియా అతన్ని దూరంగా నెట్టివేసింది. ఆయన కవిత్వాన్ని గుర్తించకుండా ఆయనని గౌరవించకుండా, అశ్లీలం అంటూ అవమానించింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ అతని మీద కట్టల కొద్దీ రిపోర్ట్లు రాసి పెద్ద ఫైలు తయారు చేసింది. ప్రభుత్వం రెండేళ్ళ కోసారి ప్రకటించే ఆస్థాన కవి హోదాని ఆయన కన్న తక్కువ స్థాయి కవుల కిచ్చి అలెన్ గిన్స్బర్గ్ ని అవమాన పరిచింది.
అమెరికా ప్రభుత్వమూ, అకడెమీషియా అతన్ని గుర్తించక పోయినా ప్రజలు అలెన్ గిన్స్బర్గ్ నీ అతని కవిత్వాన్నీ మనసారా ఆహ్వానించారు. ప్రత్యామ్నాయ సన్స్కృతిని ప్రేమించే వాళ్ళూ, మర్యాదస్తుల విలువలని ధిక్కరించే వాళ్ళూ, ఆధిపత్యాన్ని ధిక్కరించేవాళ్ళూ, యుధ్ధాన్నీ, యుధ్ధోన్మాదాన్నీ, సామ్రాజ్యవాదాన్నీ వ్యతిరేకించే వాళ్ళూ, అలెన్ గిన్స్బర్గ్ కవిత్వాన్ని ప్రేమించి ప్రతిధ్వనిస్తున్నారు. సజీవంగా నిలుపుతున్నారు. న్యూ యార్కు నగరాన్ని సందర్శించే వాళ్ళలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ని చూడడానికి వచ్చేవాళ్ళెంత మందో, అంత కన్న ఎక్కువే గిన్స్బర్గ్ కవిత్వం చదివిన గ్రీన్ విచ్ విలేజి లోని మెక్ డౌగల్ స్ట్రీట్ ని చూడడానికి ఇష్టపడి వస్తారు. కవిత్వం సమాజాన్ని తీవ్రంగా ప్రభావం చేయగలుగుతుంది అనడానికి గిన్స్బర్గ్ ‘వూళ ‘ ఒక గొప్ప సాక్ష్యం.
‘వూళ ‘ పద్యానికి యాభై యేండ్లు నిండిన సందర్భంగా అమెరికా వ్యాప్తంగా సభలూ, సమావేశాలూ, కవిత్వ పఠనాలూ, వందలాదిగా జరిగినయి. జరుగుతున్నాయి. ఈ సభలూ సమావేశాలలో ‘వూళ ‘ ను చదివే నెపంతో సాహిత్య ప్రియులు అమెరికా యుధ్ధోన్మాదాన్ని ధిక్కరిస్తున్నారు. ఇరాక్ లో వేలాది అమాయక ప్రజల ప్రాణాల్ని బలిగొన్న అమెరికా పాలకుల యుధ్ధోన్మాదాన్నీ , అమానుషత్వాన్నీ, ఆధిపత్య విధానాలనీ తీవ్రంగా ధిక్కరిస్తూ లక్షలాదిగా ప్రజలు ప్రదర్శనల్ల్లో, బహిరంగ సభల్లో ‘వూళ ‘ ని గొంతెత్తి చదువుతున్నారు. నిజానికి ఇవాళ్ళ ‘వూళ ‘ ఆవశ్యకత ఇంకా యెక్కువయింది.
1950 ల్లోనే ‘ అమెరికా! నీ ఆటం బాంబు తో నిన్ను నువ్వు విషయించుకో / అమెరికా ఇంకెన్నాళ్ళు నీ యుధ్ధోన్మాదం? ‘ అని అమెరికా సామ్రాజ్యవాద కాంక్షను తీవ్రంగా తిట్టిన అలెన్ గిన్స్బర్గ్ నేటికీ న్యూయార్క్ లో, వాషింగ్టన్ లో, షికాగోలో, శాన్ ఫ్రాన్సిస్కో లో, ఇంకా అమెరికా ప్రధాన నగరాలన్నిటిలో సజీవంగా, ఆగ్రహంగా మార్మోగుతున్నాడు. యుధ్ధానికి వ్యతిరేకంగా, పౌరహక్కుల కోసం జరుగుతున్న ప్రతి ప్రదర్శనలో మోగుతున్న ప్రతి కంఠంలో, నినదిస్తున్న ప్రతి గళంలో యెక్కడో ఒక చోట, యెప్పుడో వొక సారి, అలెన్ గిన్స్బర్గ్ ‘వూళ ‘ వినబడుతుంది. అధికారాన్నీ, మర్యాదస్తుల కపట విలువలనీ, యాంత్రీకరణనూ, పరాయీకరణనూ, ధిక్కరిస్తూ అలెన్ గిన్స్బర్గ్ యాభై యేండ్ల కింద పెట్టిన ‘వూళ ‘ ఇప్పటికీ యెంతో రెలెవెంట్ గా, అమెరికా సామ్రాజ్యవాద యుధ్ధోన్మాదానికి వ్యతిరేకంగా, అంతే ఆగ్రహంగా ప్రతిధ్వనిస్తోంది.
- నారాయణస్వామి
(సోమవారం 05 జూన్ 2006, ఆంధ్రజ్యోతి లో ప్రచురితమైన వ్యాసం)




0 responses so far ↓
There are no comments yet...Kick things off by filling out the form below.