Sanduka : The Nostalgic Chest

అపరిచిత జీవితం

సెప్టెంబరు 27, 2006 · వ్యాఖ్యానించండి

కలల ధూళి ఎగిసి
కన్నీరు గరగర లాడకుండా
నల్లని రే-బాన్ కూలింగ్ గ్లాస్సెస్ పెట్టొచ్చు .రాత్రి దుఖ్కం
నిద్రలేమి కత్తులై కోయకుండా
ఎలక్ట్రిక్ హీటర్లలో
మొహం దాచుకోవచ్చు .

గాయాల మరకలు చిట్లి
నెత్తురు పూయకుండా
రంగు రంగుల బొకేలు కప్పవచ్చు .

విషాదపు ముడుతలమీద
వెలుతురు పడకుండా
వెనీషియన్ బ్లైండ్స్
సగం మాత్రమే తెరిచివుంచవచ్చు .

సంభాషణల్లోని
లోతైన శూన్యం వినబడకుండా
ఖాళీ సీసాలని
క్షణాలుగా దొర్లించవచ్చు .

తుప్పు పట్టిన సహజాతాలు
పెళుసులీనకుండా
ఖరీదైన పేయింట్లతో
తళ తళా మెరిపించవచ్చు .

కలయికల్లోని
కౄత్రిమత్వాన్ని
సన్నిహితత్వం లోని
చల్లదనాన్ని
మర్యాద మెరుపుల జిగేళ్ళ మధ్య
మరిచిపోవచ్చు .

అద్దం ముందు నిలబడ్డప్పుడల్లా
వెక్కిరించే అపరిచిత ముఖాన్ని
గడ్డీ గాదం డాలర్లూ కూర్చి
ఇంటిముందు ఆర్భాటంగా నిలబెట్టి
శేషజీవితాన్ని మురిపెంగా గడపొచ్చు !

 - నారాయణస్వామి

వర్గాలు Poems · Telugu (తెలుగు)

0 స్పందనలు so far ↓

  • There are no comments yet...Kick things off by filling out the form below.

వ్యాఖ్యానించండి