Sanduka : The Nostalgic Chest

ఆనవాల్లు

సెప్టెంబరు 29, 2006 · వ్యాఖ్యానించండి

కాల్చేసిన వంతెనలు
దాటాల్సిన
అగాధాల్ని గుర్తు చేస్తాయికాలదన్నుకున్న సంబంధాలు
కోల్పోయిన జీవితమై
వెంటాడుతాయి

జీవం రాల్చేసుకున్న
ఎముకల చెట్టు కింద
ఒంటరితనం తచ్చాడుతుంది

డాలర్లు పండిస్త్తున్న
చేతుల్లో
వెచ్చదనమేదీ?

సుఖాలు విలసిల్లే
భోగభూమిలో
తొలకరికి పరవశించే
మట్టి పరిమళమేదీ ?

గుండె చూరునుండి
వేళ్ళాడే మంచు కడ్డీలతో
యుగాల్ని కొలుస్తున్నాను

చిట్లిపోయిన స్ఫటిక మొఖాల్లో
నెలవంక చిరునవ్వులేవీ ?

నడువ వీల్లేని రోడ్ల మీద
కప్పుకున్న దీర్ఘ రాత్రుల శీతలత్వాన్ని
ఎన్ని సుదూర ప్రయాణాలు చేదించగలవు

గమ్యం కోసం పరితపించే
మాట కోసం వెతుకుతున్నాను

నిద్రలో వత్తిగిలినప్పుడు
పగిలిన కలల పెంకులు
గుచ్చుకుంటాయి

చుట్టూ శబ్దమయ ప్రపంచమే….
అర్థమయ్యే మాటలుండవు!

ఒక ప్రాచీన నిశ్శబ్దం కోసం పరితపిస్తున్నాను

ఫెటిల్లున పగిలే
ఒక నిశ్శబ్ద నీటి బిందువు కోసం
ఆకాశం వంక ఆశగా చూస్తున్నాను

అనాది ఆగ్రహాన్ని వర్షించే
ఒక అఖండ వర్ష ధార కోసం
దోసిలి చాస్తున్నాను

బూడిద కుప్పల్లోంచి
కాంక్షలని
వెలికి తీసే
కాటికాపరిని ఎలుగెత్తి పిలుస్తున్నాను

జీవధ్వని లేని హోరు మధ్య
ఆకలి ప్రతిధ్వనించే
ఏక్ తార కావాలి నాకు!

అగాధాల్ని గుర్తు చేసే
కాలిన వంతెనల చివరి
ఆనవాళ్ళు కావాలి !!!

- నారాయణస్వామి

వర్గాలు Poems · Telugu (తెలుగు)

0 స్పందనలు so far ↓

  • There are no comments yet...Kick things off by filling out the form below.

వ్యాఖ్యానించండి