Sanduka : The Nostalgic Chest

గాల్లో ఎగిరాక ?

సెప్టెంబరు 30, 2006 · వ్యాఖ్యానించండి

తీరా గాల్లో
ఎగరడం ప్రారంభించాక గానీ

భూమ్మీద ఏమి
వదిలి వచ్చామో
తెలియదు

నేల మీద తిరుగుతున్నంత సేపూ
ఏమి పోగొట్టుకుంటున్నామో
సోయి ఉండదు

విమానం లోహపు రెక్కలార్చుకుని
రాక్షస యంత్రాల నోరు తెరచి
వీడ్కోళ్ళ చివరి ఆనవాళ్ళను
మింగేసాక గానీ

మూసుకున్న కన్రెప్పల
వెనుక
చూడలేక పోయిన దృశ్యం
అగపడదు

చుట్టూ స్పౄశించలేని
నీలి పొర
దిగులుగా వ్Yఆపిస్తే గానీ

వణుకుతున్న చేతులతో
ముఖాన్ని తడిమిన
మట్టి ఆత్మీయత
అర్థం కాదు

మనది కాని
ఒక శబ్ద ప్రపంచం
మన భాష అయ్యాక

పోగొట్టుకున్న
పలకరింపుల ఆర్తి వెనుక
అనుబంధాల గాద్గదికత
వినబడదు.

ఎన్ని ముఖాల చిరునవ్వులు
ఎన్ని చేతుల స్పర్శలు
ఎన్ని కంఠ స్వరాల ఆర్ద్రతలు

దేన్నీ సంభాషించలేని
‘హలో’ లుగా ముగిసి పోయాయో

చేతుల్లోంచి
చివరిగా జారిపోయిన
ఇసుక రేణువు గరుగ్గా తగిలినప్పుడు
కానీ తెలియలేదు

ఇప్పుడు అంతా మాయమైనట్టే
ఉంటుంది

అన్నీ కనబడకుండా పోయినట్టే
ఉంటాయి

మళ్ళీ మఖమల్ తెరలు
గర గర లాడుతూ
పైకి లేచినప్పుడు గానీ
అర్థం కాదు
నాటకం కొత్త అంకం మొదలైందని.

- నారాయణస్వామి

వర్గాలు Poems · Telugu (తెలుగు)

0 స్పందనలు so far ↓

  • There are no comments yet...Kick things off by filling out the form below.

వ్యాఖ్యానించండి