యేమేమో చెప్తవు.
యెన్నెన్నో చూపిస్తవు.’ యీ అర్ర బాగా ఇరుకై పోయింది
దీన్నిండ ముక్క వాసనొస్తుంది. ‘గోడలకి నిండిన నీటి చెమ్మ
అల్లుక పోయిన పాదుష్టు -గడ్డి రాలుతున్న పిట్టలొదిలేసిన గూళ్ళు.
‘దీని తూర్పు దర్వాజ మూసుక పోయింది
యింక ఒకటే తొవ్వ బయటకు …’
పచ్చ పచ్చ చెమనులనూ
మెరిసే సిమెంటు అద్దాలనూ
చూయిస్తూ ‘ పా బయటకు ‘ అంటవు -ఆశపడీ లోభ పడీ
పడమటి తొవ్వలో
నడిచిన కొద్దీ
పచ్చని పచ్చికకింది
పల్లేరుగాయలు కుచ్చుకుంటయి.యెందుకో యెన్నేండ్లయిన
యీ విశాలమయిన జాగల ఇరుకై
వుక్కిరి బిక్కిరి అయితది నాకు.రివ్వుమని కొట్టె చల్లగాలిలో
వుబ్బర పోస్తది నాకు.యెంతనయిన చెప్పు.
మళ్ళా ఆ అర్రలోనే
నాకు వూపిరాడుతది.మాసిన సున్నం గోడలమీది
యెలిసిపోని జాజు రంగు మీదనే
ఇంకా మనసు గుంజుతది.యీ అర్ర గోడలే కద
మనకు గోడల్ని కూలగొట్టే
సోయి నిచ్చింది.యీ అర్ర చెత్తు నీడల్నే కద
మనం గీతల్ని మలిపెయ్యాలని
కొత్త పాటలు పాడినం.యియ్యాలెందుకో
దర్వాజలు మూసుకపోయినయని
అర్రను పాడు పెడదామంటే
మనసొప్పుత లేదు.‘యెవ్వరుంటలేరు కదా’
అని యిడిసి పెట్టి పోయినంక
చయిన్ తో నిద్ర పడతలేదు.తల్ల సుంటి అర్ర
మెత్తని వొడి లోనే
మల్లా మల్లా
తల పెట్టుకు
పండుకోవాలనిపిస్తది.తలుపులన్ని బార్లా తెరిసి
యెగిరిపోయిన పిట్టలన్నిటిని
లోపలకు పిలవాలని
ఒక్కటే ఆరాటమనిపిస్తది.(అర్ర అంటే గది అని)
(రాసేటప్పుడు జావెద్ అఖ్తర్ మేరా కమ్రా యాద్ ఆతా హై గుర్తుకు లేదు కానీ యెక్కడో సబ్ కాన్షస్ లో చక్కర్లు కొట్టే వుంటుంది)
– నారాయణ స్వామి
అర్ర
అక్టోబర్ 4, 2006 · 1 వ్యాఖ్య
వర్గాలు Poems · Telugu (తెలుగు)





1 స్పందన so far ↓
mbbhushan // అక్టోబర్ 10, 2006 వద్ద 5:42 పూర్వాహ్నం
nice to see the poetry made available here
mallokasaari chadivinaa
chadivina prathi saari mana ooriki poyyi vachinattu untadhi
keep writing