Sanduka : The Nostalgic Chest

తల్లి తెలంగాణ

అక్టోబర్ 6, 2006 · వ్యాఖ్యానించండి

యిన్నేండ్లుగ
యెన్నడూ వినబడని గొంతు వొకటి
నెర్రెలు బారిన నేలమీద యెగిరి దుంకి
‘ ఇదంత నా నేల
దీని సరిహద్దు గీతల్ని నేను నిర్ణయిస్తా
అని ప్రకటించింది.’ఈ నక్ష మీద
అధికారం మొత్తం నాదే కావాలీ అంటూ
పెద్ద నోరుతో అరిచింది.

‘ యీ బూమి మీద ఇంత నెత్తురు పారుతుంటె
యిన్ని తలకాయలు తెగిపడుతుంటె
చారెడు నేల కోసం యిన్ని గొంతులు పగిలి
గుక్కెడు నీల్ల కోసం యిన్ని గుండెలు యెండి
బుక్కెడు మెతుకుల కోసం యిన్ని బతుకులు మండి
యిన్నేండ్ల నుండి కన్నీరు మున్నీరు అవుతుంటె
యెక్కడున్నవ్ బిడ్డ నువ్వు
యాడికిబోయినవ్ ‘
తల్లి తెలంగాణ కోపంగ అడిగింది.

‘ఓ అవ్వ! నేను మొదట్నుంచి నీవోడినే
యీ నేల గాలీ రాజ్యం అన్నీ నావే
నీకు అసలయిన పాలకుడ్ని నేనే’

‘నా కనుసైగలల్ల
నడవాల్సిన యీ రాజ్యాన్ని
యాభై యేండ్ల నుండి
యికుమతు దెల్సిన దొరలు
నాకు కాకుండ చేసిండ్రు

నన్నే అవుతలకు నూకేసిండ్రు !

మన పండ్లన్నిటిని మెక్కి
బీళ్ళు మనకిచ్చిండ్రు..
వాండ్ల నుండి సొతంత్రం కోసుకొచ్చి
నీకిస్త !
నడుం గట్టు మరోసారి కొట్లాటకు !! ‘

‘ బిడ్డా
నేను పెద్ద దాన్ని పేదదాన్ని
కండ్లు సరిగ్గ కనబడక పోయిన
నిన్ను గుర్తుపట్టిన
చెవులు యినరాకపోయిన
నీ గొంతు నా కెరికె
యీ తల్లి యిన్ని దినాలకు
యాదికొచ్చినాది కొడుకా

గట్లే గానీ
యీ భూమ్మీద
నీదె రాజ్యం కానీ
పరాయోని కంటె
సొంతింటొడు నయమే కద

ఒక్కటడుగుత కొడుకా
నీకు నా దుక్కం తెల్స నా కడుపుకోత తెల్స
యేండ్లనుండి నా రెక్కల కష్టం తెల్స
యెండి పోయిన నా కండ్ల బావులు తెల్స
నా వుసురు తెల్స
ముసురు పట్టిన నా మనసు తెల్స

కానీ కొడుక
అట్లే కానీ

పదిలంగ వుండు కొడుక
గట్టిగ కొట్లాడు
నియ్యతుగ నిలబడు

మన నీళ్ళు మనం తాగి
మన బువ్వ మనం తిని

మన పాట మన మాట
మనం తలెత్తుకుని తిరిగె
మన రాజ్యం తే కొడుక

బిడ్డ
ఒక్క ముచ్చట

నేను పెద్దదాన్నయిన పట్టుదలపోలె
కండ్లు కనబడక పోయిన ద్రుష్టి మందం కాలే
వయసు మీదబడ్డ కొట్లాడె హజం తగ్గలె
పెయ్యంత పుండయిన ప్రశ్నించె వోపిక తగ్గలె

మునుపటికి నీ అసుంటోల్లు మస్తు మంది వచ్చిండ్రు
నా బిడ్డల నోట్ల నా నోట్ల మట్టి గొట్టి
మూటలు గట్టుక పోయిండ్రు

మేము మునుపటిలెక్క
యేమి తెల్వనోల్లం గాదు

యేండ్లుగ దొరల రాజ్యం
పాలల్ల యిసమూ నీల్లల్ల నెత్తురూ కలిపిన
మా బతుకులు
మాకు ఊపిరి తీసుకున్నట్టె కొట్లాట గూడ నేర్పినయి.
నువ్వు మనందరికోసం నిలబడితె పానమిస్తం
గట్టెక్కినంక నీ తొవ్వ నువ్వె జూసుకుని
మా నెత్తుల మీద చేతులు పెడితె
పానంతోటె పాతరేస్తం ! ‘

- నారాయణస్వామి

(తెలంగాణా కోసం ఉద్యమం షురువయినప్పుడు)

వర్గాలు Poems · Telugu (తెలుగు)

0 responses so far ↓

  • There are no comments yet...Kick things off by filling out the form below.

వ్యాఖ్యానించండి