Sanduka : The Nostalgic Chest

చెరువేమయ్యింది !

అక్టోబర్ 7, 2006 · అభిప్రాయములు

యిక్కడ వొక చెరువుండేటిదీ
‘యేదీ యిప్పుడు ‘కూలిపోయిన
కట్ట మిద నడుసుకుంటూ
మట్టి బెడ్డలేరుకుంటం.

కాలం కానప్పుడు
కనీసం వొక బురదగుంటలెక్కనయిన వుండేదీ .

కాల్లుజేతులుడిగినా
పొక్కిలయిన వాకిట్ల కూసుండి
వచ్చె పోయెటోల్లను అటకాయించే
ముసలి అవ్వోలుండేది.

యింటి మీద గూనపెంకులల్ల అద్దం ముక్క లెక్క
యెండిన మొగులుకు యాల్లాడుతుండేది -

‘యెట్లా యెగిరెటోల్లం
చెరువున్నప్పుడు
కాలమయి చెరువుల నీల్లున్నప్పుడూ

కప్పలు యిటు అటు గున గున దుంకినప్పుడు

గోజలు మూతిపెట్టి చల్లనీల్లు
మురిపెంగ తాగినప్పుడు

బురద గట్టుమీద గడ్డి పోసలు వంగి
నీల్లను కొసిరి కొసిరి ముద్దు పెట్టుకున్నప్పుడు

చెరువు కొంగుపట్టుకోని
యెట్ల ఉరికెటోల్లం.

యెప్పుడోసారి నాల్గు వానలుపడి
చారెడు నీల్లొస్తె

అత్తగారింటినుంచొచ్చిన
అక్కసుంటి చెరువును

కాగలిచ్చుకోని
యెన్నెన్ని ముచ్చట్లు
చెప్పెటొల్లము .

‘యిప్పుడు యేదీ
చెరువు ఏదిక్కడా

నీల్లు లేవు
బెక బెక కప్పల్లెవు
మునుగుకుంట తేలె
బుడుబుంగలు లేవు .

‘కాలం గాలేదు బిడ్డా
అని గుడ్లల్లనీల్లు తీసుకునే
అవ్వ లేదు.

భీవండికి బతుకపోయినా
బతుకమ్మ పండుక్కు
తల్లిగారింటికొచ్చె
అక్క రాలేదు .

దీపాలు ముట్టియ్యకముందె
వాడకట్టంత మారుమోగె
వుయ్యాల పాటల్లేవు.

‘యేమయింది
చెరువేమయింది
చెరువుకేమయ్యింది ‘

బోర్లేసిన
బతుకమ్మ తపుకు

సర్కారు తుమ్మలల్ల
యిరుక్కపోయిన
నీల్లు లేని తెల్ల మబ్బు

చెరువేమయిందో
యెన్నటికీ చెప్పవు.

కుక్కగొడుగుల్లెక్క
మొలుచుకొచ్చిన
గ్రనైటు కనీలు

చెరువుకేమయిందో
యెప్పుడూ చెప్పవు.

-నారాయణస్వామి

(మా యింటి వెనక మాయమయిన చెరువును తల్చుకుంటూ … )

వర్గాలు Poems · Telugu (తెలుగు)

2 స్పందనలు so far ↓

  • ఈమాట » “సందుక”: నారాయణస్వామి // జనవరి 1, 2007 వద్ద 1:44 అపరాహ్నం

    [...] బాల్య యౌవనాలకు సంబంధించిన ఇటువంటి స్మృతులు “అర్ర“, “సందుక” కవితల్లో విరివిగా కనిపిస్తాయి. తన ఊరిని గురించిన జ్ఞాపకాలు “చెరువేమయ్యింది“, “యాడకి బోయిన్రు” వంటి కవితల్లో ఉన్నాయి. ఊరి చెరువు గురించి అనేకమంది కవులు రాసారు. తమ బాల్యం నాటి పల్లెను గుర్తుచెయ్యటానికి కవులకి చెరువొక సామాన్య ప్రతీకగా మారిందనుకుంటాను. “ఇంటి మీద గూన పెంకులల్ల అద్దంముక్క లెక్క ఎండిన మొగులుకు యేల్లాడుతుండే” చెరువు గురించి ఈ కవితలో ప్రతిభావంతంగా చెప్పాడు. ఐతే, కవిత చివర్లో గ్రానైటు కంపెనీల గురించిన ప్రస్తావన అనవసరమనుకుంటాను. అది లేకపోయినా విషయం అర్థమౌతూనే ఉంది. కవిత మరికొంత సాధారణీకరింపబడుతుంది కూడా. [...]

  • చెరువోయి… మా ఊరి చెరువు « గుండె చప్పుడు… // ఫిబ్రవరి 19, 2007 వద్ద 4:45 పూర్వాహ్నం

    [...] తన ఇంటి వెనుక ఉన్న చెరువు మాయమవటంతో నారాయణ స్వామి పడుతున్న వేదనను ఇక్కడ చదవండి [...]

వ్యాఖ్యానించండి