Sanduka : The Nostalgic Chest

అంజాన్

అక్టోబర్ 11, 2006 · వ్యాఖ్యానించండి

తలపై
రెండు నిండు మట్టి కుండలతోఅరచేతుల్లో
ఎగరడానికి సిద్దంగా ఉన్న పక్షి పిల్లలతో

దూది మబ్బుల నీలి నీటి

ఆకాశం తెరలపైన తేలుతూ

పేగు తెంచుకున్న నేల మీద పెంచుకున్న

ఎనలేని ప్రేమలతో
రాలాను …

విమాానం కిటికీల్లోంచి
కింద వంటి మీద
కొత్త కొత్త నగల్తో కొత్త కొత్త వలువలతో
కొంగ్రొత్త చూపుల్తో
నా నగరం…..నా ఆదిమ ప్రేయసి!
నాకోసం నిద్ర మాని
ఇణ్ణేళ్ళుగా ఏమై పోయావ్ అంటూ
కోపంతో అలకతో ప్రేమతో
నీరు పొర్లుతున్న చెరువుల కళ్ళతో
నన్నలుముకుంటుందనుకున్నాతెగిపోయిన నా రెక్కల్ని
సుతిమెత్తని చేతులతో నిమిరి
నా బుజాలకు అతికిస్తుందనుకున్నా

నేను మోసుకొచ్చిన వన్నీ
తనివితీరా తడిమి
అతి జాగ్రత్తగా
చీర చెంగులో పొదువుకుంటుందనుకున్నా
ఏడేళ్ళ నవ్వుల్నీ
పచ్చి నెత్తుటి కన్నీటి మరకలనీ
కాళ్ళకింద నలిగిపోయిన పసిరెక్కలనీ
వాడిపోయిన కళ్ళనీ

వేలాదిగా రాలిపోయిన పూలరెమ్మలనీ
ఏకబిగిన ఏకరువు పెట్టి ఊపిరాడనీయదనుకున్నా!

నేలకు దిగిన విమానంలా
వంటరిగా దిగాలుగా
నేను
నా ప్రేయసి
నాముందునుంచే హడావుడిగా అటూ ఇటూ వెళ్ళిపోయింది

ఉరుకులతో పరుగులతో
నాకు అతి కొత్తైన భాషల చప్పుళ్ళతో
నేను పోల్చుకోలేని ముఖాలు మెరుపులతో
సరసరా జారిపోయింది
నా వైపు చూసే తీరిక లేదు
చూసినా గుర్తుపట్టలెదు

అర్ధరాత్రి వర్షపు చీకట్లో పారేసుకున్న
ఉంగరంలా
జరా జరా దొర్లిపోయింది

యుగాలుగా
తన ఎడతెరపి లేని దుక్క బీభత్స ప్రేమ ప్రవాహంలో మునిగిన నన్ను
ఏళ్ళ ఎడబాటు తోనే పూర్తిగా మర్చిపోయింది
నా ఊపిరి తేమలోని వెచ్చదనాన్నీ
నా పెదవుల ముద్దులోని ఉప్పదనాన్నీ
నా కౌగలింత లోని చెమట వాసనని
తానెన్నడూ ఎరగనట్టే
ఎడమొఖమై అంజాన్ కొట్టింది

నేనే మనసుండపట్టలేక
గ్యాపకాల సుడిగాలులతో పిలిచినా
రెండు చేతులూ విరగబూసి చాచినా
ఎవరు నువ్వు అన్నట్టుగా
ఎకసక్కెపు చూపుల్ని విసిరిపారేసింది

మట్టి నీటి కుండలు పగిలి
రెక్కలురాని పక్షి ఈకలు చెదిరి
నేల మీద కలలని ఏరుకుంటున్న
నన్ను
దారికడ్డం లెమ్మంటూ
నూకేసి విసవిసా పోయింది

నిలువునా తడిసి ముద్దైన నేను

స్పర్శ మరిచిన
ప్రేయసి తడి లేని చూపులముందు

నాకు నేనే అజ్నబీని!

వర్గాలు Poems · Telugu (తెలుగు)

0 responses so far ↓

  • There are no comments yet...Kick things off by filling out the form below.

వ్యాఖ్యానించండి