వాళ్ళు కంటి నిండా నిద్రే పోలేదో
కడుపు నిండా తిండే తినలేదో
చెమట చెమట కూడబెట్టి
నలభయీఇదు తో భాగించి
నీ కోసం పంపిండ్రు.
నడవడానికి కాళ్ళుంటే సరిపోవా
అనుకున్నరు కనకనే
వాళ్ళ రెక్కలు కత్తిరించి
నీకతుకుబెట్టి
ఏడు సముద్రాలు
దాటించిండ్రు
ఆకలి కింత గంజి వున్నా లేకున్నా
కలల్నిండ నిన్ను మాత్రమే
నింపుకోని
వాళ్ళే వత్తులై
వెలుగుతున్రు.
నువ్వు నాలుగు డాలర్లు పంపితే
కులుకుదామని కాదు
కానీ ప్రేమగా నోరార పిలువకపోతవా అని
పూట భోజనం కష్టమైనా
ఐయెస్డీ లు చేసి నిన్ను విసిగిస్తరు.
అమెరిక నుండి
మేడిన్ చైనా వింత వస్తువులు
పంపుతావని కాదు కానీ
కనీసం యాడాదికోసారి
ఎవరితోనైన నీ గుర్తులు పంపితే
మురుద్దామనుకున్నరు.
వాళ్ళ వంశోద్ధారకమనే కాదు కానీ
సొంత నెత్తురు కద పాల నవ్వుల్ల చూసుకోని
పత్తికాయలౌదామనుకున్నరు
వాల్ల మీద కన్న
డాలరుమీద ప్రేమ పెరిగిందని తెల్వక కాదు కానీ
దగ్గరుంటె పేగు సంబంధాన్ని
దినాం చూసుకోవచ్చని
ఉన్నయన్ని యిడిసిపెట్టి
ఎగురుకుంట వచ్చిన్రు.
వయసు మీదబడ్డ
నడుములూ మోకాల్లూ
చాకిరీకి కిర్రుమనుకుంట
వడిపెడుతున్నా
చిన్నబుచ్చుకోనోల్లు
‘ వూరోల్ల బుద్దులూ ‘
అని నీ కొనుక్కున్న నాజూకుతనం
గడియ గడియకూ విసుక్కుంటె
గుడ్లల్ల నీళ్ళు తీసుకున్రు.
నువ్వు నీకు వీలున్నప్పుడే
పంజరంల పట్టుకపోయినట్టు
బయటకు తీసుకపోతే
నలుగురెన్నడూ కూడలేని చౌరస్తాలనూ
అడుగుపెట్టి నడవలేని రోడ్లనూ
అఫ్సోసయి చూసి అదే అద్రుష్టమనుకుంట
మొండి రెక్కల్ని పునుకుకున్నరు.అవసరాలు తీరినంక
నువ్వు టిష్యు పేపర్ లెక్క విసిరేసినా
వూల్ల పెంకుటిల్లు ముంగట్నే
పొక్కిలైన వాకిట్ల కూసోని
మల్ల కొడుకెప్పుడొస్తడో నని
ఎదురుచూస్తున్రు.
నీకు నీ పిల్లలకు
అన్ని వసతులు చేసేందుకు
ఇంకా తమ
శరీరంల ఎక్కెడెక్కడ
జాగ వుందో చూసుకుంటున్రు!




4 స్పందనలు so far ↓
chandu // అక్టోబర్ 12, 2006 వద్ద 8:58 పూర్వాహ్నం
chaalaaa chaaalaaa baga rasaru!! Keep it up!!
charasala // అక్టోబర్ 12, 2006 వద్ద 4:13 అపరాహ్నం
చాలా చక్కని కవిత.
రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లలను దూరదేశాలు పంపించి వాళ్ళు మాత్రం దిక్కులేని వారిలా సొంత వూరిలో వుంటారు. అప్పుడొ ఇప్పుడో ఈ దేశానికి వచ్చినా చలికి బయటికి పోలేరు, రాని ఇంగ్లీషులొ మాట్లాడలేరు. తమకు చేతకాని దొడ్లు, అంతా పంజరంలా చిలకలా బందీలయిపోతారు ఆరు నెలలు. ఇంటికొచ్చిన చుట్టాలవైపు బిక్కుబిక్కుమంటూ చూస్తారు.
–ప్రసాద్
http://charasala.com/blog/
abhisarika // అక్టోబర్ 13, 2006 వద్ద 9:40 పూర్వాహ్నం
Chala Bavundi :) nijam !
bollojubaba // మే 7, 2008 వద్ద 3:11 అపరాహ్నం
మంచి కవిత ఆర్ధ్రత తో ఉంది. గుండె చెమర్చింది.
బొల్లోజు బాబా