అవ్వా !

‘ మల్ల యెప్పుడొస్తవు కొడుకా avva
యేండ్ల ముచ్చట్లు చెప్పుకొనే
బుద్ది తీరకముందే
బయల్దేరిన
నా చెయ్యిని చేతులల్లకు తీసుకుంది –

గుడ్డి అద్దాల కండ్లెనుక
కుర్వక కుర్వక కుండపోతగ
కురిసిన వానసుంటి
ఆపేక్ష –

‘ నువ్వొచ్చెటాల్లకు నేనుంటనో పోతనో
రక్తముడిగిపోయింది కొడుక -‘

యింట్లకు యెప్పుడు చూసిన
దువ్వెనలోలె గిర గిర తిరిగే పిల్లల్లేరు –

యెనుక అర్రలనుండి
యిరాము లేకుండ కొట్టుకునె
మగ్గం యినబడుత లేదు –

యెటూ పోలేక యింట్ల గాలి బీరిపోయినట్టుంది.
‘సూరతుకు బతుక పోయిండు కొడుకు.
యీడ నేసిన బట్టలెవరు తీసికొంటలే .
రెక్కల కష్టమంత యేట్ల పోసినట్టాయె.
దారపు కండెలు గావాలంటెనే
అప్పుల తాడు మెడకు బడె.’

యేండ్ల నుండి సున్నంజాజుల్లేక
పాత మట్టిగోడల యిల్లు
అల్ కబీరు కు తీసుకపోతున్న
బక్కావు లెక్క బొక్కల్డేలింది .

‘ అంత అయిపోయింది బిడ్డavva
వయసు పోరగాల్లంత
దేశాలుపట్టి పోయిండ్రు.
యెప్పుడొస్తరో తెల్వదు –
యియ్యల రేపు అనుకుంట
కాటికి కాల్లుజాపుకోనున్నా

‘మీరున్న జాగల మంచిగుంటద కొడుకా ?’
యెంత మంచిగున్నా –

బిడ్డల కోసం పానమిచ్చి
యెప్పుడు గూట్లెకొస్తరోనని
దినామూ రాత్రీ
కండ్లల్ల వొత్తులేసుకొని తల్లడిల్లే
నీ అసుంటి ఆత్మగల్ల తల్లుల్లేరు .

అన్నీవుంటయి గని అవ్వా –
కాయలు గాసిన చేతుల
బర్సుదనంతోటి
మెత్తగ చెంపలు పునికి
‘యాడున్నా సల్లగ బతుకు బిడ్డా’ అని
దీవించే నువ్వు లేవు.

Leave a comment